Tips For Weight Loss: అధిక బరువును తగ్గించే మార్గాలు.! 1 month ago

చాలామంది అనేక కారణాల వల్ల, అధిక బరువుతో బాధపడుతుంటారు. అధిక బరువు అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. మన శరీర బరువు మన ఎత్తుకు తగ్గట్టుగా ఎంత బరువు ఉండాలో తెలుసుకుని సాధ్యమైనంత వరకూ ఆ విధంగానే మెయిన్‌టైన్ చేయాలి. అయితే, అలా బరువు మెయిన్‌టైన్ చేయాలంటే మన జీవన, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఉదయాన్నే గోరువెచ్చని నీరు
నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. ఎంత ఎక్కువగా నీరు తీసుకుంటే మన శరీరానికి అంత మంచిది. ముఖ్యంగా ఉదయాన్నే గోరువెచ్చని నీరు తీసుకోవడం మరీ మంచిది. ఇది మన శరీరానికి తగినంత ఎనర్జీని ఇస్తుంది. ఈ నీటిలో ఓ స్పూన్ నిమ్మరసం, ఓ స్పూన్ తేనె కలపండి. మరిన్నీ ఎక్కువ లాభాలుంటాయి. ఉదయాన్నే ఈ చర్యతో మీ రోజుని ప్రారంభించండి. ఇలా చేయడం వల్ల శరీరంలో కొవ్వు పూర్తిగా కరిగిపోతుంది, నీరు కేవలం ఉదయం మాత్రమే కాకుండా రోజంతా తీసుకోవాలి. ఇలా తరచూ నీరు తీసుకోవడం మంచిది. దీని వల్ల బరువు తగ్గడమే కాకుండా ఇంకా ఎన్నో లాభాలుంటాయి.
వ్యాయామం
ప్రతీరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఒక అరగంట సమయం అయినా వాకింగ్, జాగింగ్ చేయడం కోసం గడపాలి. ఇలా చేయడం వల్ల కండరాలన్నీ ఉత్తేజితమవుతాయి. రోజులో ఖచ్చితంగా వ్యాయామానికి కొంతసమయాన్ని కేటాయించుకోవాలి. కొంతమంది వ్యాయామం చేసేందుకు అంతగా ఆసక్తి చూపరు. అలాంటివారు, డ్యాన్స్ క్లాసులకి, జుంబా క్లాస్ వంటి వాటికి వెళ్లొచ్చు. లిఫ్ట్ వాడే బదులు మెట్లు ఎక్కి దిగడం వంటి పనులు చేస్తే మంచిది.
ఫైబర్ ఫుడ్
శరీరానికి ఫైబర్ ఫుడ్ చాలా ముఖ్యం. శరీరంలోని అనవసరపు వ్యర్థాలను బయటకు పంపి, బరువు తగ్గించడంలో ఫైబర్ మంచిగా పనిచేస్తుంది. జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. దాని కారణంగా బరువు కూడా త్వరగా తగ్గుతారు. అయితే, ఫైబర్ ఎక్కువగా ఏ ఆహార పదార్దాలలో ఉంటుందంటే ముఖ్యంగా ఓట్స్, గోదుమలు, బీన్స్, మొక్కజొన్న లాంటి ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తరచూ వీటిని తినడం వల్ల బరువు తగ్గుతారు.
నిద్ర
ఈ కాలంలో నిద్రలేమి సమస్య కూడా చాలామందిని వేధిస్తోంది. కానీ, సరైన నిద్ర అనేక సమస్యలను దూరం చేయటమే కాకుండా మరుసటి రోజును ఉల్లాసంగా ఉంచుతుంది. ప్రతి రోజూ కచ్చితంగా 8 గంటలు నిద్ర పోయేలా చూసుకోవాలి. పడుకునే ఒక గంట ముందు నుంచి టీవీ, ఫోన్ లకు దూరంగా ఉండాలి. ఎందుకంటే, వాటిని అదేపనిగా చూస్తుంటే ఆ ఎఫెక్ట్ కళ్లపై పడి నిద్రలేమి సమస్యకు కారణమవుతుంది.
గమనిక: పైన అందించిన ఈ ఆరోగ్య సమాచారం మరియు సూచనలు మీ అవగాహన కొరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి సమస్య ఉన్నా, వైద్యులను సంప్రదించడం ఉత్తమం.